Home / Government / Public Service Commission / TSPSC / TSPSC – Aiming Residential Posts – Information and Guidance

TSPSC – Aiming Residential Posts – Information and Guidance

గురుకుల పోస్టులపై గురిపెట్టారా?

నిరుద్యోగ ఉపాధ్యాయ పట్టభద్రులకు గురుకుల విద్యాసంస్థల్లో కొలువుల ప్రకటన సువర్ణావకాశంగా చెప్పవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవటానికి గరిష్ఠ కృషి అవసరమవుతుంది. నియామక పరీక్షలో నెగ్గటం కోసం పకడ్బందీ ప్రణాళికతో అభ్యర్థులు సన్నద్ధం కావాలి!

పేద విద్యార్థులు ఎక్కువగా చదివే గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో భారీస్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగనుంది. మంచి వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి పోటీ తీవ్రస్థాయిలో ఉండడం సహజం.

తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంక్షేమ సొసైటీల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో పీజీటీ, టీజీటీ, పీఈటీ, పీడీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌, లైబ్రేరియన్‌, స్టాఫ్‌ నర్స్‌ ఉద్యోగాల నియామకం జరగబోతోంది. మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్‌ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల సొసైటీల ఆధ్వర్యంలోని విద్యాలయాల్లో వివిధ స్థాయుల్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు.

* జోన్‌ స్థాయిలో నియామకాలు జరుగుతాయి.
జోన్‌-V లో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలు; జోన్‌-VI లో రంగారెడ్డి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాలు ఉన్నాయి.
* నియామకాలు స్థానిక, స్థానికేతర (నాన్‌-లోకల్‌) నిష్పత్తిలో జరుగుతాయి.
* అభ్యర్థులు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివిన ప్రాంతం / జిల్లా ఆధారంగా జోన్‌ను నిర్ణయిస్తారు. (గమనిక: సాధారణంగా డీఎస్‌సీ ద్వారా జరిగే ఉపాధ్యాయ నియామకాలు జిల్లా యూనిట్‌గా జరుగుతాయి).

పరీక్ష విధానం
పీజీటీ, టీజీటీ, పీడీ ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష, ప్రధాన పరీక్ష ఉంటాయి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షగానో, ఆఫ్‌లైన్‌ ఓఎంఆర్‌ పద్ధతిలోనో పరీక్ష జరుగుతుంది.
* పరీక్ష పత్రాలు ఆంగ్లమాధ్యమంలో ఉంటాయి.
* అభ్యర్థుల వయసు: 01-07-2017 నాటికి 18 సం॥ నుంచి 44 సం॥ వరకు.
* ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీలకు 5 సం॥, పీహెచ్‌ (దివ్యాంగులకు) 10 సం॥ గరిష్ట వయః పరిమితి నడలింపు ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీసుననుసరించి గరిష్ఠంగా 5 సం॥ సడలింపు ఇస్తారు.

ఫీజు: ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రాసెస్‌ ఫీజు రూ. 200/-. దీనికి అదనంగా రూ. 120/- పరీక్ష ఫీజు చెల్లించవలసివుంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, పీహెచ్‌ వర్గాలవారికీ, 18 సం॥ నుంచి 44 సం॥ మధ్య వయసు నిరుద్యోగ అభ్యర్థులకూ పరీక్ష ఫీజు మినహాయింపు ఉంది. ఫీజును ఆన్‌లైన్‌ ద్వారా ఎస్‌బీఐ ఈపే ద్వారా చెల్లించవచ్చు.

పరీక్ష కేంద్రాలు: స్క్రీనింగ్‌ పరీక్ష హైదరాబాద్‌లో, లేదా తెలంగాణ రాష్ట్రం గతంలో ఉన్న జిల్లాల ప్రధాన కేంద్రాల్లో జరుగుతుంది. ప్రధాన పరీక్ష హైదరాబాద్‌లో నిర్వహిస్తారు.

సహాయ కేంద్రం: దరఖాస్తు ఆన్‌లైన్‌లో సమర్పించటం, హాల్‌టికెట్లు పొందటం, ఇతర సాంకేతిక సమస్యల సందేహ నివృత్తి కోసం 040-23120301, 040- 23120302 ఫోన్‌ నంబర్లను కార్యాలయ పనివేళల్లో సంప్రదించవచ్చు.
email: helpdesk@tspsc.gov.in

* దరఖాస్తు చేయటానికి ఆన్‌లైన్‌ పద్ధతిని అనుసరించాలి.
* వెబ్‌సైట్‌: http://www.tspsc.gov.in
* దరఖాస్తు ఆన్‌లైన్‌లో నింపటానికి ఈ ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాల్సివుంటుంది.

1) విద్యార్హతల సర్టిఫికెట్లు 2) పుట్టిన తేదీ సర్టిఫికెట్‌/ ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ 3) పాఠశాల స్టడీ సర్టిఫికెట్లు 4) ఉద్యోగి అయితే యాజమాన్యం నుంచి ‘నిరభ్యంతర పత్రం’ సిద్ధం చేసుకునివుండాలి. 5) కమ్యూనిటీ సర్టిఫికెట్‌ 6) పాఠశాలలో రెగ్యులర్‌గా చదవనివారూ, ప్రైవేటుగా చదివినవారూ రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ను వెరిఫికేషన్‌ సమయంలో పొందుపరచవలసి ఉంటుంది.

ఎంపిక విధానం
* ప్రిలిమినరీ/స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపినవారిని 1: 15 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేస్తారు (రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పద్ధతిలో). ప్రధాన పరీక్షలోని మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.

గమనిక: ప్రిలిమినరీ/ స్క్రీనింగ్‌ టెస్ట్‌ మార్కులు తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.

* దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు వెబ్‌సైట్‌లో వివిధ ఖాళీలు రిజర్వేషన్ల వారీగా పరిశీలించి అవగాహన చేసుకున్న తర్వాత తమ సబ్జెక్టులను జోన్‌ల వారీగా, సంస్థల వారీగా సరిచూసుకొని దరఖాస్తు చేయడం మంచిది.

సన్నద్ధత మెలకువలు
ప్రిలిమినరీ పరీక్షను 150 ప్రశ్నలు, 150 మార్కులకు 2 గం॥ 30 ని॥ కాలవ్యవధిలో రాయవలసివుంటుంది.
* సెక్షన్‌-1లో జనరల్‌ స్టడీస్‌, సెక్షన్‌-2లో జనరల్‌ ఎబిలిటీస్‌, సెక్షన్‌-3లో ఆంగ్లంలో ప్రాథమిక సామర్థ్యాలను పరీక్షిస్తారు.

* జనరల్‌ స్టడీస్‌లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు, భారత రాజ్యాంగం, సామాజిక సంస్కృతి, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, విపత్తు నిర్వహణ, సుస్థిర అభివృద్ధి, దేశంలో తెలంగాణలో ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక చరిత్ర చదవాలి. ప్రధానంగా రాష్ట్ర సాధన ఉద్యమం, తెలంగాణ ఏర్పాటు అభ్యసించాల్సివుంటుంది.

* జనరల్‌ ఎబిలిటీస్‌లో లాజికల్‌ రీజనింగ్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, నైతిక విలువలు, విద్యలో వృత్తి విలువలు, బోధనా సామర్థ్యం అంశాలు అభ్యసించాలి.

* ఆంగ్ల ప్రాథమిక పరిజ్ఞానంలో పాఠశాల స్థాయి ఆంగ్ల వ్యాకరణంపై, vocabulary, words, sentences పై ప్రశ్నలు అడిగే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఇటీవల నిర్వహించిన వివిధ ఉద్యోగాల పరీక్ష పత్రాలను పరిశీలించి, ఏయే అంశాలపై ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నారో పరిశీలించాలి. ఈ అవగాహనతో ఆ భావనలపై పట్టు సాధించాలి.

వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన మెంటల్‌ ఎబిలిటీ పుస్తకాల్లో లాజికల్‌ రీజనింగ్‌, డాటా ఇంటర్‌ప్రెటేషన్‌ మెటీరియల్‌, మోడల్‌ పేపర్ల ద్వారా విషయ పరిజ్ఞానం గ్రహించాలి. సాధన చేయాలి.

* బోధనా సామర్థ్యం కోసం బి.ఇడి కోర్సు సిలబస్‌ సన్నద్ధత కొనసాగించాలి.

* ఇంగ్లిష్‌ కోసం సెకండరీ పాఠశాల స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాలు రిఫర్‌ చేయడం, సాధన చేయడం మంచిది.

ప్రిలిమినరీ పరీక్ష వడపోత పరీక్షలాంటిది. కాబట్టి ప్రధాన పరీక్షకు ఎంపిక కావడం అనేది ఈ పరీక్ష ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభ్యర్ధులు జనరల్‌ స్టడీస్‌ కోసం వివిధ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాల ఆధారంగా సన్నద్ధత కొనసాగించవలసివుంటుంది.

ఇంగ్లిష్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ కోసం బి.ఇడి ప్రవేశపరీక్ష, డీఎస్‌సీ, టెట్‌ పాత పరీక్షపత్రాల ఆధారంగా మెటీరియల్‌ సేకరణ, సన్నద్ధత, సాధన అవసరం.

జనరల్‌ ఎబిలిటీస్‌లో లాజికల్‌ రీజనింగ్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, నైతిక విలువలు, విద్యలో వృత్తి విలువలు, బోధనా సామర్థ్యం అంశాలు అభ్యసించాలి.


మెయిన్‌ పరీక్ష సంగతి?

మెయిన్‌ రాత పరీక్ష 300 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది.
* పేపర్‌-1 : ఎంచుకొన్న సబ్జెక్టు బోధనాశాస్త్రం నుంచి 150 మార్కులకు 150 ప్రశ్నలు 2 గం॥ 30 ని॥లో రాయాల్సివుంటుంది.

* పేపర్‌-2: ఎంచుకున్న సబ్జెక్టు కంటెంట్‌పై 150 ప్రశ్నలు 150 మార్కులకు 2 గం॥ 30 ని॥ లలో రాయాల్సివుంటుంది..

బోధనాశాస్త్రానికి (పెడగాజి) సంబంధించి బి.ఇడిలో అభ్యసించినమెథడాలజీని సిలబస్‌కు అనుగుణంగా,టెట్‌, డీఎస్‌సీల పాత ప్రశ్నపత్రాలు విశ్లేషించుకుని తయారవ్వాలి.

పేపర్‌-2 సబ్జెక్టు కంటెంట్‌ టీఎస్‌పీఎస్‌సీ నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం ప్రాథమిక భావనలు మొదలు క్లిష్టస్థాయి వరకూ విశ్లేషణాత్మకంగా అభ్యసించాలి.

ప్రశ్నల కఠినస్థాయి గురించి స్పష్టత లేనప్పటికీ సాధారణంగా పీజీటీ ఉద్యోగాల ప్రశ్నల కఠినతాస్థాయి టీజీటీ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. విశ్లేషణాత్మకంగా, అనుప్రయుక్త ధోరణిలో ఉండే అవకాశం ఉంది. సబ్జెక్టు కంటెంట్‌లోని ప్రశ్నల సరళి కోసం డీఎస్‌సీ ఉపాధ్యాయ ఉద్యోగ పరీక్షల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌ స్థాయి గత ప్రశ్నపత్రాలు, జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగాల కోసం నిర్వహించిన ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాలు ఉపయోగకరం. వీటి ఆధారంగా విశ్లేషణధోరణిలో అధ్యయనం చేసి, సాధన చేయాలి.

 

With Courtesy: http://www.eenadu.net/special-pages/chaduvu/chaduvu-inner.aspx?featurefullstory=10666

Check Also

TSPSC – PHYSICAL DIRECTOR (SCHOOL) IN RESIDENTIAL EDUCATIONAL INSTITUTIONS

Applications are invited Online from qualified candidates through the proformaApplication to be made available on …

Leave a Reply